Wednesday, 6 May 2020

భగవద్గీత 6-26
"  శ్రీకృష్ణామృతం " ... "  భగవద్గీత విజ్ఞానసారం "
  బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 
" యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ !
తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ !! "
తాత్పర్యం :
" చంచల స్వభావం కలిగిఉండి , ఎంతమాత్రమూ నిలకడ లేని మనస్సు ఎక్కడెక్కడ 
సంచరిస్తుంటే అక్కడక్కడ నుంచి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్టు చెయ్యాలి .
ధ్యాన వివరణ :
" మనస్సు " అనేది ఆలోచనల పుట్ట ...
చంచలత్వం దాని యొక్క మౌలిక స్వభావం !
అది ఎంతసేపూ ఇంద్రియవిషయాల సుఖాల మీదకి ... గత స్మృతులలోకీ ...
ఎక్కడెక్కడికో ... పరుగులు తీస్తూనే ఉంటుంది.
అటువంటి దానిని ఆత్మలో స్థితమయ్యేటట్టు చెయ్యాలంటే ... 
ఉన్న గొప్ప ఉపాయం " శ్వాస మీద ధ్యాస " .
మనలో జరుగుతూన్న శ్వాసను గమనిస్తూ ... గమనిస్తూ ... గమనిస్తూ ఉండాలి 
కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ... ఉండాలి .
అయితే మనస్సు శ్వాసను గమనించడం మానేసి ,
దాని సహజ అలవాటు ప్రకారం ఎక్కడికో ...
ఏదో ఆలోచనకు ... వెళ్లిపోతూనే ఉంటుంది .
వెంటనే దాన్ని అక్కడి నుంచి వెనకకు తీసుకువచ్చి ...
మళ్ళీ మళ్ళీ శ్వాసనే గమనింప చేయాలి .
మనస్సు ఎన్నిసార్లూ ఎక్కడెక్కడికి పోతున్నా ...
అన్నిసార్లూ అక్కడక్కడ నుంచి తీసుకువచ్చి ...
శ్వాసనే గమనించేటట్టు చెయ్యాలి ! ...
ఆ విధంగా చేస్తూనే ఉండాలి !
ఇదే మనం చేయవలసిన సాధన ...
" ధ్యానసాధన " ... " యోగసాధన " ... " ధ్యానయోగసాధన " .
ఫలితంగా మనలోని అనవసర ప్రాపంచిక ,
సంసారిక భావప్రవాహం ఆగిపోయి ...
ఆలోచనారహితస్థితి కలుగుతుంది .
అంటే ... మనస్సు నషిస్తుందన్నమాట !
మనస్సు నశించినపుడు ... " ఆత్మపదార్ధం " అన్నది అనుభూతికి వస్తుంది .
అహింస పరమో ధర్మః ! 
( " Feeling Is The  Language of The Soul . " -
" అనుభూతి అన్నది ఆత్మ యొక్క పరిభాష . " - నీల్ డొనాల్డ్ వాల్ష్ )

No comments:

Post a Comment

  🌹ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటారు.  ప్రజలు తమ కాంతిని ,ప్రేమను ,సహకారాన్ని ,అవగాహనను, క్షమాగుణాన్ని, కృతజ్ఞతను...